

భారత్‌లో గూగుల్ భారీగా ఉద్యోగులను తొలగిస్తోందంటూ ఇటీవల వచ్చిన వార్తలపై సంస్థ స్పందించింది. లేఆఫ్‌లకు సంబంధించిన ప్రచారాన్ని ఖండించింది. గత వారం గూగుల్ క్లౌడ్ ఇండియా విభాగంలో కొన్ని సంస్థాగత మార్పులు చేపట్టినట్లు వెల్లడించింది. పని ప్రాధాన్యతలను పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా సుమారు 30 ఉద్యోగ బాధ్యతలను (రోల్స్) తొలగించినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ మార్పుల వల్ల ప్రభావితమైన ఉద్యోగులు ఏ టీమ్‌కు చెందినవారనే వివరాలను వెల్లడించలేదు. లేఆఫ్‌లపై ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌కు గూగుల్ క్లౌడ్ ఇండియా అధికారిక ఖాతా స్పందిస్తూ.. భారత్‌లో చిన్నపాటి సంస్థాగత మార్పులు మాత్రమే చేపట్టినట్లు పేర్కొంది.
ఇటీవల గూగుల్‌లో భారీగా ఉద్యోగుల కోతలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఉద్యోగులు 24 గంటల్లో రాజీనామా చేయాలని, లేదంటే తొలగిస్తామని సంస్థ హెచ్చరిస్తున్నట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. వచ్చే జనవరిలో మరిన్ని తొలగింపులు ఉండొచ్చనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఈ ప్రచారంపై స్పందించిన గూగుల్.. భారీ స్థాయిలో లేఆఫ్‌లు జరుగుతున్నాయన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. సంస్థాగత ప్రాధాన్యతలకు అనుగుణంగా గూగుల్ క్లౌడ్ ఇండియాలో పరిమిత మార్పులు మాత్రమే చేపట్టినట్లు వివరించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!