

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దేశీయ కంపెనీలు మళ్లీ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. మివి, ఫైర్‌బోల్ట్, ఏఐ+ వంటి సంస్థలు ఇప్పటికే బడ్జెట్ ధరల్లో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయగా, తాజాగా ఒకప్పుడు మొబైల్ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన కార్బన్ కూడా రీఎంట్రీకి సిద్ధమవుతోంది. జైనా గ్రూప్ సీఈఓ ప్రదీప్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం, జన్‌జీ యువతతో పాటు కంటెంట్ క్రియేటర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరుగుతున్న సమయంలో కార్బన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
కొత్త ఫోన్ విడుదల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, అమెజాన్‌లో ‘కార్బన్ రెబల్ 5జీ’ పేరుతో మైక్రోసైట్ కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2011లో కార్బన్ ఏ1 పేరుతో తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన ఈ సంస్థ, చైనా కంపెనీల నుంచి పెరిగిన పోటీ కారణంగా తర్వాత మార్కెట్‌కు దూరమైంది. ప్రస్తుతం దేశీయ మొబైల్ తయారీదారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. 2028 నాటికి దేశీయంగా రూపొందించి తయారు చేసిన మొబైళ్లను చూడగలమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్బన్ రీఎంట్రీతో పాటు, నథింగ్ తన సబ్‌బ్రాండ్ సీఎంఎఫ్‌ను పూర్తి భారతీయ కంపెనీగా మార్చనున్నట్లు ప్రకటించడం దేశీయ స్మార్ట్‌ఫోన్ రంగంలో మారుతున్న పరిణామాలకు సంకేతంగా నిలుస్తోంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!