

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం, డిజిటల్ సేవల అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) స్టాక్ మార్కెట్‌లో ఘనంగా అరంగేట్రం చేసింది. గత వారం విజయవంతంగా ముగిసిన తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) అనంతరం బుధవారం కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఇతర స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో నమోదయ్యాయి. ఐపీఓ ధర రూ.1,119తో పోలిస్తే బీఎస్‌ఈలో షేరు రూ.1,358 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి 21.36 శాతం ప్రీమియాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత రూ.1,423.80 గరిష్ఠ స్థాయికి చేరి, ఐపీఓ ధరతో పోలిస్తే 27.33 శాతం పెరిగింది. తొలి రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 26.67 శాతం లాభంతో రూ.1,417.50 వద్ద స్థిరపడింది. దీంతో జియో ప్లాట్‌ఫామ్స్ మార్కెట్ విలువ సుమారు రూ.13.05 లక్షల కోట్లకు చేరి, దేశంలో రెండో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. ఈ క్రమంలో టెలికాం రంగంలోని ప్రధాన ప్రత్యర్థి ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టింది.
జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్‌తో దేశంలోని ప్రముఖ కంపెనీల మార్కెట్ విలువల ర్యాంకింగ్స్‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. సుమారు రూ.15.67 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, దాదాపు రూ.12.16 లక్షల కోట్ల విలువతో ఎయిర్‌టెల్ మూడో స్థానానికి పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలవగా, టీసీఎస్ ఆరో స్థానానికి చేరింది. ఐపీఓ ధర ఆధారంగా జియో ప్లాట్‌ఫామ్స్ మార్కెట్ విలువ సుమారు రూ.10.3 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అయితే, లిస్టింగ్ రోజున షేరు ధర భారీగా పెరగడంతో కంపెనీ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. దీంతో ఐపీఓ ఇన్వెస్టర్లకు సుమారు రూ.2.75 లక్షల కోట్ల అదనపు మార్కెట్ విలువ సమకూరినట్లు అంచనా. ప్రపంచ టెలికాం కంపెనీల్లో జియో ప్లాట్‌ఫామ్స్ ఏడో స్థానంలో, ఆసియాలో చైనా మొబైల్ తర్వాత రెండో స్థానంలో నిలిచినట్లు నివేదిక పేర్కొంది.
జియో ప్లాట్‌ఫామ్స్ షేర్ల లిస్టింగ్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫామ్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కలిపిన రిలయన్స్ గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.30 లక్షల కోట్లకు చేరింది. దీంతో దేశంలో అత్యంత విలువైన కార్పొరేట్ గ్రూపుల జాబితాలో టాటా గ్రూప్‌ను వెనక్కి నెట్టి రిలయన్స్ అగ్రస్థానానికి చేరినట్లు నివేదిక తెలిపింది. టాటా గ్రూప్ రెండో స్థానంలో, అదానీ గ్రూప్ మూడో స్థానంలో నిలిచాయి. జియో లిస్టింగ్‌ను పురస్కరించుకుని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ముంబైలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో ఉద్యోగుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీపావళికి ముందుగానే అక్టోబర్ నెల జీతాలను చెల్లించడంతో పాటు, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నగదు బోనస్‌లు లేదా పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలలో 75 శాతాన్ని కూడా ఉద్యోగులకు చెల్లించినట్లు తెలిసింది. స్టాక్ మార్కెట్‌లో జియో ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని, రాబోయే దశాబ్దాల్లోనూ షేర్‌హోల్డర్లకు విలువను అందించడంలో రిలయన్స్ సంప్రదాయాన్ని కొనసాగిస్తుందని అంబానీ పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!