

గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రారంభించారు. సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.11.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రెండు కొత్త ప్రాజెక్టులకు కూడా పునాది వేశారు. మొత్తం దాదాపు రూ.190 కోట్ల విలువైన ఈ పనుల్లో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్, చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చేపట్టిన కార్యక్రమాలు ఉన్నాయి. రక్షిత మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల అభివృద్ధికి ఈ ప్రాజెక్టుల్లో ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా నార్త్ చెన్నైలో పునరుద్ధరించిన కడపాక్కమ్ చెరువును విజయ్ ప్రారంభించారు. సుమారు రూ.58 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు దాదాపు 55 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు. చెరువు పరిసరాలను ఎకో పార్కుగా తీర్చిదిద్ది, సందర్శకుల కోసం బర్డ్ ఐలాండ్, సీతాకోకచిలుకల పార్కు, టర్ఫ్ ఏరియా వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను పెంపొందించడం, జీవవైవిధ్యాన్ని కాపాడటం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు. నగరంలో పెరుగుతున్న జనాభా, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను మరింత విస్తరిస్తామని విజయ్ తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!