

జార్ఖండ్‌లో హోంగార్డు ఉద్యోగం సాధించాలనే కలతో ప్రయత్నించిన కవితా మహతోకు నిరాశ ఎదురైంది. రామ్‌గఢ్ జిల్లాకు చెందిన ఆమె చీర ధరించి, చెప్పుల్లేకుండా 1,600 మీటర్ల పరుగును 8 నిమిషాల 57 సెకన్లలో పూర్తి చేసి గతంలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పరుగు కోసం నిర్ణయించిన 10 నిమిషాల గడువులోనే లక్ష్యాన్ని చేరుకోవడంతో ఆమె పట్టుదలపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.
అయితే, హోంగార్డు నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన హైజంప్ పరీక్షలో మూడు అవకాశాలు లభించినప్పటికీ ఆమె అర్హత సాధించలేకపోయారు. దీంతో నియామక ప్రక్రియ నుంచి అనర్హతకు గురయ్యారు. భర్త మరణం తర్వాత ఇద్దరు పిల్లలను పెంచడంతో పాటు వృద్ధులైన అత్తమామల బాధ్యతలను కూడా కవితా మహతో నిర్వహిస్తున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న ఆమె ఆశకు ఈ ఫలితం అడ్డంకిగా మారింది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ మెరుగైన భవిష్యత్తు కోసం ప్రయత్నించే అభ్యర్థుల సవాళ్లను ఆమె కథ మరోసారి గుర్తుచేస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!