

ప్రజలకు అన్ని రకాల వైద్య సౌకర్యాలను జిల్లా స్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ దిశగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (డీఎస్‌హెచ్) పునర్‌వ్యవస్థీకరణపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కి) రూపొందించిన అధ్యయన నివేదికలోని ప్రతిపాదనలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డీఎస్‌హెచ్ పరిధిలోని ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్య సేవలు, అవసరమైన వైద్య సిబ్బంది, ఆధునిక డయాగ్నొస్టిక్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ద్వితీయ స్థాయి వైద్య వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు కూడా హైదరాబాద్, బోధనాసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, అస్కి డైరెక్టర్ సుబోధ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!