

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కోకన్వీనర్ అశుతోష్ రంకా అస్సాంలో పర్యటిస్తున్నారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియతో ప్రభావితమైన వారిని కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటానని ఆయన తెలిపారు. శనివారం గువహటిలో మీడియాతో మాట్లాడిన రంకా సర్ ప్రక్రియ కారణంగా అస్సాంలో పలువురు ఓటు హక్కును కోల్పోయారని ఆరోపించారు. ఆదివారం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తానని చెప్పారు. ఇందుకోసం సీజేపీ వలంటీర్లు ఏర్పాట్లు చేస్తున్నారని, పాఠశాలల పరిశీలన అనంతరం వారితో సమావేశమవుతానని తెలిపారు.
అస్సాంతో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోనూ సీజేపీకి మద్దతు పెరుగుతోందని అశుతోష్ రంకా అన్నారు. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన తమ నిరసన కార్యక్రమాలకు అస్సాం నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని, త్వరలో అస్సాంతో పాటు ఇతర రాష్ట్రాల్లో సీజేపీ రాష్ట్ర యూనిట్లను ప్రకటిస్తామని చెప్పారు. మెరుగైన భారత్ కోసం కృషి చేయడం, జవాబుదారీతనం పెంచడం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం తమ ప్రధాన లక్ష్యాలని రంకా పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!