

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 66వ రోజు పలువురు హౌస్‌మేట్స్‌కు భావోద్వేగభరితమైన, మధురమైన క్షణాలను మిగిల్చింది. బుధవారం ఎపిసోడ్‌లో ముకేశ్‌కు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఎదురైంది. అతని తల్లి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తల్లిని చూడగానే ముకేశ్ తీవ్ర భావోద్వేగానికి గురై ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఆమె కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, మిగతా హౌస్‌మేట్స్‌ను కూడా ప్రేమగా పలకరించారు. ఈ సందర్భంగా ముకేశ్ తన ప్రవర్తనలో ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయా అని తల్లిని అడిగాడు. అందుకు ఆమె అతని కోపమే ప్రధానమైన లోపమని చెప్పింది. వర్షిణి తన కోపాన్ని చాలా వరకు తగ్గించిందని ముకేశ్ సమాధానమివ్వగా, ఇంకా నియంత్రించుకోవాలని తల్లి సూచించింది.
ఆ తర్వాత తన తల్లి గురించి ముకేశ్ హౌస్‌మేట్స్‌తో భావోద్వేగ విషయాలను పంచుకున్నాడు. తన తండ్రికి స్ట్రోక్ వచ్చిన సమయంలో దాదాపు రెండేళ్ల పాటు మంచానికే పరిమితమైన ఆయనకు తల్లి ఒక్కరే సేవలు చేశారని గుర్తుచేసుకున్నాడు. అంతటి కష్ట సమయంలోనూ ఆమె ఎప్పుడూ విసుక్కోవడం తాను చూడలేదని తెలిపాడు. తల్లి చూపిన ఓర్పు, అంకితభావం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని, జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అప్పుడే నిర్ణయించుకున్నానని చెప్పాడు. అనంతరం అమన్ తండ్రి కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. ఇతర సభ్యులను ఆప్యాయంగా పలకరించిన ఆయన, తన కుమారుడితో కొంత సమయం గడిపి వెళ్లారు. ఆయన రాకతో ఎపిసోడ్‌లో మరో భావోద్వేగభరితమైన సందర్భం చోటుచేసుకుంది.
ఇక ఎపిసోడ్‌లో మరో ప్రధాన ఆకర్షణ మాజీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ఎంట్రీ. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొన్న ప్రియాంక, ప్రస్తుతం సీజన్ 10లో ఉన్న శివకుమార్‌తో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. శివకుమార్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్రియాంక రహస్యంగా హౌస్‌లోకి వచ్చినప్పటికీ, ఆమెను శివకుమార్‌తో పాటు మిగతా సభ్యులు వెంటనే గుర్తుపట్టారు. దీంతో ఇద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకుని, ముద్దులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. అనంతరం హౌస్‌మేట్స్ సమక్షంలో శివకుమార్, ప్రియాంకల నిశ్చితార్థ వేడుక రొమాంటిక్‌గా జరిగింది. ఎంగేజ్‌మెంట్ దుస్తుల్లో ఈ జంట చూడముచ్చటగా కనిపించడంతో 66వ రోజు ఎపిసోడ్‌లో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!