

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృషితో జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి మార్గం సుగమమైంది. ఈ స్టేషన్ల ఆధునీకరణకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అధికారుల బృందాలను ఆయా స్టేషన్లకు పంపి, ప్లాట్‌ఫారాల పొడిగింపు, ప్రయాణికుల కోసం షెడ్లు, ఆధునిక నిరీక్షణ మందిరాలు, తాగునీటి సౌకర్యాల కల్పనపై అధ్యయనం చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. జమ్మికుంటలో సరుకుల రైళ్లకు సరుకు ఎక్కించే, దించే సదుపాయంతో పాటు రోడ్డు కింద మార్గం నిర్మాణానికి కూడా అధికారులు అంగీకారం తెలిపారు. ఉప్పల్ స్టేషన్‌లో రిజర్వేషన్ టికెట్ కౌంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో బండి సంజయ్ సమావేశమై కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పెండింగ్ రైల్వే పనుల పురోగతిని సమీక్షించారు. మూడేళ్లుగా పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే మార్గాన్ని 2028 చివరి నాటికి పూర్తి చేయాలని బండి సంజయ్ కోరగా, సిరిసిల్ల వరకు డిసెంబర్ నాటికి, వేములవాడ వరకు వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అక్కడే రైల్వే స్టేషన్ నిర్మించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి మూడు లేదా నాలుగు సార్లు రైళ్లు నడపాలని, శబరిమల యాత్రికుల కోసం ఈ సీజన్‌లో వారానికి కనీసం రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. చెన్నై-భగత్ కీ కోఠి రైలును పెద్దపల్లిలో, సికింద్రాబాద్-దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌ను జమ్మికుంటలో నిలిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కరీంనగర్ రైల్వే రిజర్వేషన్ కేంద్రం మరమ్మతులు, పని వేళల పొడిగింపు, కొత్తపల్లిలోని సరుకుల రవాణా కేంద్రాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!