

ఇటీవల చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించిన విచారణను నిర్వహించడం రాజ్యాంగబద్ధమేనా? విశ్వవిద్యాలయ పాలనా నిబంధనలకు అనుగుణంగా ఉందా? అనే అంశాలను పరిశీలించనున్నట్లు నల్సార్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవ రావు తెలిపారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి ముందుంచి, సభ్యులతో సంప్రదింపులు జరిపిన అనంతరం తీసుకునే నిర్ణయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తెలియజేస్తామని చెప్పారు. విశ్వవిద్యాలయ రాబోయే స్నాతకోత్సవం నేపథ్యంలో నెలకొన్న వివాదం మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు ప్రచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో, 2026 బ్యాచ్ విద్యార్థుల బార్ కౌన్సిల్ నమోదు ప్రక్రియపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. అయితే కొందరు చేసిన తప్పుకు అందరినీ శిక్షించడం సరికాదని భావించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో విద్యార్థులు ప్రస్తుతం తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. అదే సమయంలో జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులు, వారిని ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఉన్న ఉపాధ్యాయుల పేర్లతో నివేదిక సమర్పించాలని విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!