

ముంబయిలో పారిశుద్ధ్య నిర్వహణ, కాలుష్య నియంత్రణ విషయంలో బృహన్ ముంబయి కార్పొరేషన్ (BMC) పనితీరుపై బాంబే హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నగరానికి వీఐపీలు వచ్చినప్పుడు మాత్రమే రోడ్లను శుభ్రం చేయడంపై ప్రశ్నించింది. ముంబయి ప్రజల కోసం నిత్యం వీధులను పరిశుభ్రంగా ఎందుకు ఉంచడం లేదని నిలదీసింది. బ్రిటన్ యువరాజు విలియం, ఆయన భార్య ఇటీవల ముంబయిలో పర్యటించిన సందర్భంగా కొన్ని రోడ్లను శుభ్రం చేసి, పరిసరాలను అందంగా తీర్చిదిద్దిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
నగరంలోని కంజూర్‌మార్గ్ డంపింగ్ గ్రౌండ్ సమీపంలో కాలుష్య సమస్యకు పరిష్కారం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ముంబయిలోని పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోందని, రోడ్లపై వ్యర్థాలు, ప్లాస్టిక్ చెత్తతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. పరిస్థితుల్లో మార్పు రాకపోతే వార్డు స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని బీఎంసీని హెచ్చరించింది. ప్లాస్టిక్ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయడంతోపాటు చెత్తను సరైన పద్ధతిలో పారవేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బీఎంసీ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!