

విజయవాడలో అక్టోబర్ 10న ‘ఛలో రాజ్‌భవన్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ప్రకటించారు. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారి పేర్ల తొలగింపునకు బాధ్యత వహించారంటూ ఆరోపిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. బుధవారం బాలోత్సవ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
ఎన్నికల సంఘం విధుల్లో పారదర్శకత, నిష్పాక్షికతపై ఆందోళనలు ఉన్నాయని ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, ఎఐవైఎఫ్ తదితర సంఘాల నాయకులు ఆరోపించారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు పునరుద్ధరించడంతో పాటు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువత, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘ఛలో రాజ్‌భవన్’ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం మాత్రం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తొలగింపులు తుది నిర్ణయం కాదని, క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేసింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!