

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తో పాటు రాజ్యాంగ సభ సభ్యుల సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. భారతదేశ సంప్రదాయాలు, నాగరికత, జ్ఞాన సంపద నుంచి స్ఫూర్తి పొంది ఆధునిక రాజ్యాంగాన్ని రూపొందించడం వారి గొప్పతనమని పేర్కొన్నారు. రాజ్యాంగం పార్లమెంటు, న్యాయస్థానాలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లోనూ ప్రతిబింబించాలని, ముఖ్యంగా యువతకు రాజ్యాంగ విలువలపై అవగాహన పెంచాలని అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టిన తనకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సేవ చేసే అవకాశం కల్పించిన ఘనత రాజ్యాంగానిదేనని తెలిపారు. ఒకరి పుట్టుక, పరిస్థితులు వారి భవిష్యత్తును నిర్ణయించలేవని రాజ్యాంగం నిరూపిస్తోందన్నారు. పేదరిక నిర్మూలన, గృహ నిర్మాణం, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్, ముద్ర, పీఎం-స్వనిధి, యూపీఐ వంటి పథకాలు, సేవలు ప్రజలకు గౌరవం, సమానత్వం, సామాజిక, ఆర్థిక న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.
రాజ్యాంగ సవరణలు, చారిత్రక నిర్ణయాలను ప్రస్తావించిన మోదీ.. గతంలో కొన్ని ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తిని బలహీనపరిచాయని విమర్శించారు. మొదటి రాజ్యాంగ సవరణ, ఎమర్జెన్సీ సమయంలో చేసిన 42వ సవరణతో పాటు 38వ, 39వ సవరణలను యువత అధ్యయనం చేయాలని సూచించారు. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను తొలగించేందుకు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేశారని, ఆర్టికల్స్ 370, 35ఏ కారణంగా జమ్మూకశ్మీర్‌లో రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలుకాలేదని పేర్కొన్నారు. నక్సలిజం నిర్మూలనతో పేదలు తమ రాజ్యాంగ హక్కులను మరింత స్వేచ్ఛగా వినియోగించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతిపక్ష పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచన రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన చట్టం ఆమోదం పొందకుండా అడ్డుకోవడం కూడా రాజ్యాంగ విలువల పట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తోందన్నారు. ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సింది పోయి అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించిన ప్రధాని.. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ‘ఇండియా ఫస్ట్’ ఆలోచన, ‘కర్తవ్య పాలన’ ఆచరణ మార్గదర్శకాలుగా ఉండాలని పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!