

టిబెట్ బౌద్ధమత అత్యున్నత ఆధ్యాత్మిక గురువు దలైలామా తదుపరి వారసుడి ఎంపిక ప్రక్రియపై భారత్‌తోనే చర్చలు జరపాలని అమెరికా కమిషన్ సూచించింది. ఈ వ్యవహారంలో చైనా జోక్యం చేసుకోకుండా చూడాలని పేర్కొంది. తదుపరి దలైలామాను ఎంపిక చేసే అధికారం దలైలామాకు చెందిన ‘గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్’కే ఉండాలని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దలైలామాకు దిల్లీలోని ల్యూటెన్స్ ప్రాంతంలో బంగ్లా కేటాయించిందన్న అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, దీనిపై కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ అనేది దలైలామా కార్యాలయానికి సంబంధించిన సంస్థ. దలైలామా సంస్థను పరిరక్షించడం, ఆయన ఆధ్యాత్మిక సేవలను కొనసాగించడం దీని ప్రధాన లక్ష్యాలు. మత సామరస్యాన్ని ప్రోత్సహించడం, టిబెట్ సంస్కృతిని కాపాడటం, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలోనూ ఈ ట్రస్ట్ పనిచేస్తోంది. తదుపరి దలైలామా ఎంపిక విషయంలో ఈ సంస్థకు కీలక బాధ్యత ఉండాలని అమెరికా కమిషన్ అభిప్రాయపడింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!