

అర్నబ్ తుఫాను ప్రభావంతో విశాఖపట్నంలో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో పాటు ఈదురు గాలులు వీస్తున్నాయి. బలమైన గాలులకు నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరుగుతున్నాయి. అంగాడి దిబ్బలో ఓ ఇంటిపై చెట్టు కూలినట్లు సమాచారం. ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో రోడ్డుకు అడ్డంగా చెట్టు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ గాలుల కారణంగా హోర్డింగ్స్ చిరిగిపోతున్నాయి. ఆర్కే బీచ్‌లో సముద్రపు అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతూ తీరంవైపు చొచ్చుకొస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలోని పర్యాటక ప్రాంతాలను అధికారులు మూసివేశారు.
తుఫాను పరిస్థితుల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆంధ్రా యూనివర్సిటీకి పది రోజుల పాటు, ఇతర విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చినట్లు సమాచారం. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు. కొండవాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు మూడు రోజుల పాటు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!