

దిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని ఆన్‌లైన్‌లో కుర్తీ ఆర్డర్ చేసి మోసపోయిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను వెలుగులోకి తెచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఫాతిమా దిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్న సమయంలో ఓ షాపింగ్ ఖాతాలో కనిపించిన కుర్తీని ఆర్డర్ చేసింది. ఇందుకోసం విక్రేత వాట్సాప్‌లో పంపిన క్యూఆర్ కోడ్ ద్వారా తొలుత రూ.400 చెల్లించింది. అనంతరం పార్శిల్ డెలివరీ పేరుతో ఫోన్ చేసిన నిందితులు, ఆమెకు వచ్చిన పాస్‌కోడ్‌ను చెప్పాలని కోరారు. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు పేరుతో డబ్బులు చెల్లిస్తే తిరిగి వాపసు చేస్తామని నమ్మించి పలుమార్లు రూ.1,150, రూ.2,000, రూ.2,650, రూ.650 బదిలీ చేయించారు. చివరకు పార్శిల్ అందకపోవడంతో పాటు డబ్బులు తిరిగి రాకపోవడంతో తాను మోసపోయినట్లు ఫాతిమా గుర్తించింది. ఈ ఘటనపై నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయగా, నార్త్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో బాధితురాలు వివిధ క్యూఆర్ కోడ్‌లకు చెల్లించిన డబ్బు కెనరా బ్యాంకులోని ఓ ఖాతాకు చేరినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఖాతాతో సంబంధం ఉన్న ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడు ఇచ్చిన సమాచారంతో మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితులపై వివిధ రాష్ట్రాల్లో 27 సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నకిలీ సంస్థలు, వ్యక్తుల పేర్లతో తెరిచిన 25 బ్యాంకు ఖాతాల ద్వారా సుమారు రూ.30 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఖాతాలను సైబర్ నేరాల ద్వారా వచ్చిన డబ్బును మళ్లించేందుకు ఉపయోగించినట్లు అనుమానిస్తూ పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!