

భారత్‌లో ఓ బిడ్డను పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ల వరకు పెంచేందుకు అయ్యే ఖర్చుపై కంటెంట్ క్రియేటర్ విఖ్యాత్ సింగ్ చేసిన అంచనాలు చర్చనీయాంశంగా మారాయి. గర్భధారణ, ప్రసవం, వైద్య పరీక్షలు, మందులు, ఆహారం, విద్య, ట్యూషన్లు, ఆరోగ్యం, దుస్తులు, వినోదం, రవాణా తదితర ఖర్చులను కలిపి ఒక్కో బిడ్డపై సుమారు రూ.1.39 కోట్లు ఖర్చవుతుందని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, ఉన్నత విద్య, పెట్టుబడుల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం రూ.2 కోట్లకు పైగా చేరవచ్చని అంచనా వేశారు.
ఆయన లెక్కల ప్రకారం.. గర్భధారణ, ప్రసవం, వైద్య ఖర్చులకు సుమారు రూ.3 లక్షలు, తొలి రెండేళ్లలో డైపర్లు, టీకాలు, ఆహారం తదితరాలకు రూ.6 లక్షలు ఖర్చవుతాయి. 2 నుంచి 18 ఏళ్ల మధ్య ఆహారం కోసం రూ.15 లక్షలు, విద్యకు రూ.33 లక్షలు, ట్యూషన్లకు రూ.9 లక్షలు, ఆరోగ్య సంరక్షణకు రూ.5.4 లక్షలు, వినోదానికి రూ.9 లక్షలు, దుస్తులకు రూ.7.2 లక్షలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు రూ.4 లక్షలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు రూ.8 లక్షలు, రవాణాకు రూ.8 లక్షలు, అదనపు ఇంటి అద్దెకు రూ.32.4 లక్షలు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పిల్లల పెంపకం ఖర్చుతో కూడుకున్నదని అంగీకరిస్తుండగా, మరికొందరు పిల్లలు ఇచ్చే ప్రేమ, ఆనందాన్ని డబ్బుతో కొలవలేమని అంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!