

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియపై నెలకొన్న అనుమానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నికల కమిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ ఇప్పటికే వ్యక్తం చేస్తున్న అనుమానాలకు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు మరింత బలం చేకూరుస్తున్నాయని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలపై ఎన్నికల సంఘం ఏకగ్రీవతను ప్రకటించినప్పటికీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన నివేదికలు రాజకీయ చర్చకు దారితీశాయి.
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో సెప్టెంబర్ 28న తెలంగాణవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఉదయం 10.30 గంటలకు ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రారంభించి ప్రదర్శన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై వచ్చిన ప్రశ్నలకు స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!