

మురసు తుఫాన్ సమయంలో సముద్రంలో ఏర్పడిన తీవ్ర అలల కారణంగా తమిళనాడుకు చెందిన ఓ బోటు మునిగిపోయి ఐదుగురు మత్స్యకారులు మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 29వ తేదీన తమిళనాడుకు చెందిన మూడు మత్స్యకార బృందాలు మూడు బోట్లలో చేపల వేటకు బయలుదేరాయి. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రెండు బృందాలకు చెందిన మత్స్యకారులు రామాయపట్నం పోర్టు సమీపంలో తమ బోట్లను నిలిపివేశారు. అయితే, మూడో బోటులో ఉన్న పక్కిరిసామి సూరియా (49), కుప్పన్ (48), మోహన్ (47), రాజేశ్ (52), మురుగన్ (48), కుప్పుసామి (58), విజయకాంత్ (44), అరవింద్ (40), నారాయణన్ (57) అనే తొమ్మిది మంది మత్స్యకారులు ఏపీలోని నిజాంపట్నం రేవు వద్ద చేపల వేట కొనసాగించారు.
ఈ క్రమంలో రామాయపట్నం వైపు తిరిగి రావాలని మిగతా బృందాల మత్స్యకారులు వారికి సమాచారం అందించారు. దీంతో ఈ నెల 3వ తేదీ ఉదయం నిజాంపట్నం రేవు నుంచి బయలుదేరిన వారి బోటు, కొత్తపట్నం పల్లెపాలేనికి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో తుఫాన్ అలల ధాటికి సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయింది. బోటులో ఉన్న తొమ్మిది మందిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గురువారం నాలుగు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకురావడంతో స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం కోస్ట్‌గార్డ్ సిబ్బంది మరో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మత్స్యకారుల కోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు గాలింపు చర్యలు చేపట్టాయి. తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చార్టర్ ఫ్లయిట్ ద్వారా డ్రోన్ కెమెరాలను పంపించి సముద్రంపై గాలింపు చేపడుతోంది. మరోవైపు మత్స్యకారుల కుటుంబ సభ్యులు కొత్తపట్నం తీరానికి చేరుకుంటున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!