

కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచాన్ని సమూలంగా మార్చే దిశగా వేగంగా దూసుకెళ్తోంది. ఈ రంగంలో ప్రతిభావంతులైన పరిశోధకులను సొంతం చేసుకునేందుకు అంతర్జాతీయ టెక్ సంస్థలు భారీ ప్యాకేజీలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ ఏఐ పరిశోధకుడు త్రపిత్ బన్సల్‌కు మెటా సంస్థ ఏకంగా రూ.800 కోట్ల విలువైన ప్యాకేజీ ఆఫర్ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. తన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌కు నాయకత్వం వహించే బాధ్యతలను ఆయనకు అప్పగించాలని మెటా భావిస్తున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన త్రపిత్ చిన్నప్పటి నుంచే గణితంలో ప్రతిభ కనబరిచాడు. ఆ ఆసక్తితోనే ప్రతిష్ఠాత్మక ఐఐటీ కాన్పూర్‌లో ప్రవేశం పొందాడు. 2012లో చదువు పూర్తి చేసిన తర్వాత యాక్సెంచర్‌లో కన్సల్టింగ్ అనలిస్ట్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. అయితే పరిశోధనలపై ఆసక్తితో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా చేరాడు. అక్కడ బేసియన్ మోడలింగ్, ఇన్ఫరెన్స్ మెథడ్స్ వంటి అంశాలపై పరిశోధనలు చేశాడు.
ఆ తర్వాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ ఆమ్‌హర్ట్స్‌లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్, పీహెచ్‌డీ పూర్తి చేశాడు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పీ), డీప్ లెర్నింగ్, మెటా లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక అంశాల్లో నైపుణ్యం సంపాదించాడు. ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థల్లో పరిశోధన ఇంటర్న్‌గా పనిచేసే అవకాశాలు దక్కించుకున్నాడు. 2017లో ఓపెన్‌ఏఐలో రీసెర్చ్ ఇంటర్న్‌గా చేరిన ఆయన, 2022లో పూర్తిస్థాయి ఉద్యోగిగా మారాడు. అక్కడ ఏఐ రీజనింగ్‌కు సంబంధించిన పరిశోధనల్లో కీలకంగా పనిచేశాడు. ముఖ్యంగా 2024లో పరిచయమైన ఓపెన్‌ఏఐ o1 రీజనింగ్ మోడళ్ల అభివృద్ధికి సంబంధించిన పరిశోధనల్లో ఆయన పాత్ర ఉన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఆయన ప్రతిభను గుర్తించిన మెటా, సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ బాధ్యతలు అప్పగించేందుకు భారీ ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఐఐటీ విద్యార్థిగా మొదలైన ఆయన ప్రయాణం అంతర్జాతీయ ఏఐ పరిశోధకుడిగా ఎదిగే స్థాయికి చేరడం భారతీయ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!