

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో డిసెంబర్ 27న (ఆదివారం) ‘గండికోట రన్ 2026’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గండికోట చారిత్రక, వారసత్వ సంపదకు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు ప్రజల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్. రావత్, కార్యదర్శి ఆమ్రపాలి కాటాతో కలిసి గండికోట రన్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ (ASA), గో హెరిటేజ్ రన్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందులో ప్రారంభకుల కోసం 3 కిలోమీటర్ల ఫన్ రన్, ఔత్సాహికులు, అనుభవజ్ఞులైన రన్నర్ల కోసం 5, 10 కిలోమీటర్ల పరుగులు నిర్వహించనున్నారు. సుమారు 1,000 మంది పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
గండికోట చారిత్రక కోట, పెన్నా నది లోయ అందాలు, ప్రకృతి దృశ్యాల మధ్య సాగే ఈ పరుగు ద్వారా పాల్గొనేవారికి ప్రాంత చరిత్ర, సంస్కృతిని తెలుసుకునే అవకాశం లభిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు స్థానిక హోమ్‌స్టేలు, ఆహార విక్రేతలు, గైడ్లు, చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలను పెంచుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ 27న తెల్లవారుజామున రన్ ప్రారంభం కానుండటంతో పాల్గొనేవారు డిసెంబర్ 26న గండికోటకు చేరుకుని తమ బిబ్‌లను తీసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఆసక్తి గలవారు www.asaao.org, www.ifnish.com వెబ్సైట్లలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రతినిధులు, పర్వతారోహకులు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, షేక్ హిమాంషా తదితరులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!