

విజయవాడలోని లోక్‌భవన్ దర్బార్ హాల్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, టీబీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎస్. అబ్దుల్ నజీర్ 77వ టీబీ సీల్ విక్రయ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. 144 ఏళ్ల క్రితం సర్ రాబర్ట్ కోచ్ క్షయవ్యాధికి కారణమయ్యే సూక్ష్మజీవిని గుర్తించినప్పటికీ, ఆధునిక వైద్య రంగంలో గణనీయమైన పురోగతి సాధించినా టీబీ ఇప్పటికీ ప్రాణాంతక వ్యాధిగానే కొనసాగుతోందన్నారు.
టీబీ కేవలం వైద్యపరమైన సమస్య మాత్రమే కాదని, సామాజిక, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉందని గవర్నర్ పేర్కొన్నారు. టీబీ నిర్మూలనకు చికిత్సతో పాటు అవగాహన, ముందస్తు నిర్ధారణ, నివారణ, పోషకాహారం, సామాజిక మద్దతు, ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వ ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ 2030 ప్రపంచ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కంటే ముందుగానే దేశంలో టీబీని నిర్మూలించేందుకు సమగ్ర విధానాన్ని అనుసరిస్తోందన్నారు. టీబీ సీల్ విక్రయ ప్రచారానికి విద్యాసంస్థలు, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, ప్రజలు విరాళాలతో మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!