

తెలంగాణలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు నిత్యావసర సరుకుల సరఫరా కోసం ప్రవేశపెట్టిన పీఎంయూ కేంద్రీకృత టెండర్ల విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా పాఠశాలను ఒక యూనిట్‌గా పరిగణించి, జిల్లా కొనుగోలు కమిటీ (డీపీసీ) ద్వారా స్థానిక వ్యాపారులకే సరుకుల సరఫరా బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఈ విధానం కొనసాగితే వేలాది చిన్న వ్యాపార కుటుంబాల జీవనోపాధికి భరోసా లభించడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన, తాజా సరుకులు అందుతాయని పేర్కొన్నారు.
కేంద్రీకృత టెండర్లలో అవకతవకలు జరిగాయని, బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారని హరీశ్ రావు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా సబ్‌కాంట్రాక్టులు ఇవ్వడం, జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.66 కోట్ల గుడ్‌విల్ వసూలు చేయడం, బిల్లుల్లో ప్రతినెలా 20 శాతం కమీషన్లు తీసుకోవడం వంటి ఆరోపణలు చేశారు. స్థానిక వ్యాపారులు ఇచ్చే ధరల కంటే 35 నుంచి 45 శాతం అధిక ధరలకు కాంట్రాక్టులు ఖరారయ్యాయని, అయినప్పటికీ హాస్టళ్లకు సరుకుల సరఫరాలో సమస్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు నెలల్లోనే విఫలమై రద్దయిన విధానాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం పాత సరఫరా విధానాన్ని పునరుద్ధరించకపోతే బాధిత కుటుంబాలు, విద్యార్థుల తరఫున బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!