

సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. ప్రేక్షకులకు కొత్త తరహా కథలను అందించేందుకు ఆయన ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటుంటారు. ఇటీవల జైలర్ 2 విజయంతో ఉత్సాహంగా ఉన్న తలైవా.. తన 173వ చిత్రం ‘ధర్మన్’పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సినిమా కథకు సంబంధించి ఓ ఆసక్తికరమైన రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ జపనీస్ అనిమే సిరీస్ ‘మాన్స్టర్’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనే ప్రచారం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారనే వార్తలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. 2004–2005 మధ్య ప్రసారమైన ‘మాన్స్టర్’ సిరీస్ కూడా ఓ వైద్యుడి చుట్టూ తిరిగే కథ కావడంతో అభిమానులు ఈ రెండు కథల మధ్య పోలికలను వెతుకుతున్నారు.
‘మాన్స్టర్’ సిరీస్‌లో ఓ నిజాయితీపరుడైన న్యూరోసర్జన్.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నగర మేయర్‌ను కాదని, తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారికి ఆపరేషన్ చేసి అతడి ప్రాణాలను కాపాడతాడు. అయితే, పెద్దయ్యాక ఆ చిన్నాడు సీరియల్ కిల్లర్‌గా మారడంతో డాక్టర్ అనేక సమస్యలను ఎదుర్కొంటాడు. తన నిర్ణయం వల్ల జరిగిన పరిణామాల నుంచి బయటపడేందుకు, నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు పోరాడతాడు. అయితే, ‘ధర్మన్’ సినిమా ‘మాన్స్టర్’కు రీమేక్ లేదా అనుసరణ అని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు, ఈ చిత్రంలో రజినీకాంత్, రామ్ పోతినేని మామా అల్లుళ్లుగా కనిపించనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ కథ ‘నరసింహ’ (పడయప్ప), ‘రాఘవన్’ (వెట్టైయాడు విలైయాడు) చిత్రాల కలయికలా ఉంటుందని చెప్పినట్లు సమాచారం. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు, పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు వేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. సినిమా కథపై స్పష్టత రావాలంటే టీజర్ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!