

కోస్తాంధ్రలో సెప్టెంబర్ 23, 24 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 22న భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆ తర్వాత రెండు రోజుల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా బలపడగా, రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD పేర్కొంది. ఇది సెప్టెంబర్ 23 రాత్రి నుంచి 24 తెల్లవారుజామున మధ్య విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. కాకినాడ జిల్లా శంఖవరంలో 60.75 మిల్లీమీటర్ల గరిష్ఠ వర్షపాతం నమోదైంది. పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వంశధార, నాగావళి నదుల ప్రవాహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో 24 గంటలు పనిచేసే నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. వాగులు, ప్రమాదకర కాజ్‌వేల వద్ద రాకపోకలను నియంత్రించాలని ఆదేశించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!