

ఉత్తరప్రదేశ్‌లోని ఆసుపత్రుల ఫార్మసీల్లో మందుల కొనుగోలు ధర, గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (UPFSDA) అధికారులు మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఆసుపత్రులు సహా 214 ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 130 రకాల మందుల ధరలను పరిశీలించగా.. 36 మందులకు కొనుగోలు ధర కంటే 10 రెట్లకు పైగా ఎంఆర్‌పీ ఉన్నట్లు గుర్తించారు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే ఓ ఇంజెక్షన్‌ను రూ.74కు కొనుగోలు చేయగా, దాని ఎంఆర్‌పీ రూ.4,980గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మరో ఇంజెక్షన్ కొనుగోలు ధర రూ.7,541 కాగా, ఎంఆర్‌పీ రూ.69,995గా ఉన్నట్లు తేలింది.
మందులతో పాటు వైద్య పరికరాల ధరల్లోనూ భారీ వ్యత్యాసాలు కనిపించాయి. రూ.6కు కొనుగోలు చేసిన ఓ పరికరాన్ని రూ.163 ఎంఆర్‌పీ తో విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. ఈ పరిణామాలు ఆసుపత్రి ఫార్మసీల్లో మందులు, వైద్య పరికరాల ధరలను ఎలా నిర్ణయిస్తున్నారు, ఎలా ప్రదర్శిస్తున్నారు అనే అంశాలపై ప్రశ్నలు లేవనెత్తాయి. అయితే కొనుగోలు ధర, ఎంఆర్‌పీ మధ్య వ్యత్యాసం ఉందన్న కారణంతోనే ప్రతి సందర్భంలోనూ అది చట్టవిరుద్ధమని నిర్ధారించలేమని అధికారులు భావిస్తున్నారు. పన్నులు, పంపిణీ ఖర్చులు, నియంత్రిత ధరల నిబంధనలు తదితర అంశాలు తుది ధరపై ప్రభావం చూపవచ్చు. ప్రస్తుతం గుర్తించిన కేసుల్లో ధరల నిర్ణయం లేదా ఇతర నిబంధనల ఉల్లంఘనలు జరిగాయా అనే దానిపై అధికారులు తదుపరి పరిశీలన చేపట్టనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!