

జమ్మూకశ్మీర్‌లో లష్కరే తయ్యిబా (LeT) కమాండర్ లతీఫ్ భట్ కోసం భారత సైన్యం, సీఆర్పీఎఫ్ దళాలు గాలింపును ముమ్మరం చేశాయి. ఇటీవల సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి నేపథ్యంలో అతడి కోసం భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. సోమవారం కుల్గాంలోని లారూ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో లతీఫ్ భట్ బుల్లెట్ గాయాలపాలై తప్పించుకోగా.. మరో ఉగ్రవాది ఉమర్ నసీర్ దార్‌ను భద్రతా దళాలు హతమార్చాయి. దీంతో అతడి ఆచూకీ కోసం సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా విస్తృతంగా గాలింపు చేపట్టాయి.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లతీఫ్ భట్ ఆచూకీని గుర్తించిన భద్రతా దళాలు అతడిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో వీడియో కాల్ ద్వారా అతడితో మాట్లాడి లొంగిపోవాలని అధికారులు కోరారు. ఎలాంటి హాని తలపెట్టబోమని హామీ ఇచ్చినా అతడు అంగీకరించలేదు. దీంతో బుధవారం తెల్లవారుజామున ఇరువర్గాల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు, నవంబర్ 11న సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి ముందు లతీఫ్ భట్ కుల్గాంలో పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా వెల్లడైంది. నవంబర్ 10న మీర్ బజార్, అక్రాన్ హబ్లిస్, కిలామ్ ప్రాంతాల్లో అతడు సంచరించినట్లు గుర్తించారు. పలు కీలక ఉగ్రదాడుల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లతీఫ్ ఆచూకీ తెలిపిన వారికి రూ.15 లక్షల రివార్డును ప్రకటించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!