

తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) అభ్యర్థులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1988లో జారీ చేసిన జీవో నంబర్ 109, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2018లో వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 49 ప్రకారం ఈ రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అయితే, 2026లో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిన కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంతాలకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించలేదని విమర్శించారు. దీనివల్ల ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన ఆదివాసీ, గిరిజన యువత 400కు పైగా ఉద్యోగావకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015, 2018, 2022 సంవత్సరాల్లో విడుదలైన కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకు 75 శాతం రిజర్వేషన్లు అమలు చేసినప్పుడు, 2026 నోటిఫికేషన్‌లో వాటిని ఎందుకు అమలు చేయలేదని కవిత ప్రశ్నించారు. ఈ నిర్ణయం గిరిజనుల హక్కులకు విఘాతం కలిగిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి గిరిజన యువతకు న్యాయం చేయాలని కోరారు. 2026 కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్‌లో అవసరమైన మార్పులు చేసి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!