

యూకేను వీడుతున్న వీసాదారుల్లో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్‌ఎస్) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025 జులై నుంచి 2026 జూన్ మధ్యకాలంలో 85 వేల మంది భారతీయులు యూకేను వీడారు. వీరిలో 55 వేల మంది స్టడీ వీసాదారులు, 28 వేల మంది వర్క్ వీసాదారులు కాగా, మరో రెండు వేల మంది ఇతర వీసాలపై అక్కడికి వెళ్లినవారు. ఈ జాబితాలో 51 వేల మందితో చైనీయులు రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు, యూకేకు కొత్తగా వలస వెళ్తున్నవారిలోనూ భారతీయులే ముందున్నారు. ఈ కాలంలో స్టడీ వీసాలపై 77 వేల మంది, వర్క్ వీసాలపై 40 వేల మంది భారతీయులు యూకేకు వెళ్లారు.
2024-25లో యూకేకు 8.93 లక్షల మంది వలస వెళ్లగా, 6.89 లక్షల మంది ఆ దేశాన్ని వీడారు. దీంతో నెట్ మైగ్రేషన్ 2.04 లక్షలుగా నమోదైంది. 2025-26లో యూకేకు వెళ్లినవారి సంఖ్య 7.38 లక్షలు కాగా, అక్కడి నుంచి తిరిగి వచ్చినవారు 6.61 లక్షల మంది. దీంతో నెట్ మైగ్రేషన్ 77 వేలకు పడిపోయింది. వీసా నిబంధనల కఠినతరం, ఉద్యోగావకాశాల తగ్గుదల కారణంగా చదువు పూర్తయిన భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు అక్రమ మార్గాల్లో యూకేలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 31 వేల మందిని అధికారులు గుర్తించారు. వీరిలో 86 శాతం మంది చిన్న పడవల ద్వారా ఇంగ్లీష్ ఛానెల్ దాటినవారే. వలసలపై నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల వల్లే సంఖ్య తగ్గిందని యూకే హోం సెక్రటరీ షబానా మహమూద్ పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!