

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ పరీక్షతో పాటు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పలు రాష్ట్రాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా, విద్యార్థులకు ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువసార్లు నీట్ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కోరుతున్నాయి. పరీక్షల విధానంలో సంస్కరణలు తీసుకురావడానికి నందన్ నీలేకనీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీకి రాష్ట్రాలు ఈ ప్రతిపాదనలు సమర్పించాయి.
పరీక్షా సంస్కరణలపై అభిప్రాయాలు సేకరించేందుకు కమిటీ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యాసంస్థలు, నిపుణులు, పరీక్షల నిర్వహణ సంస్థల నుంచి దాదాపు 50 వేల సూచనలను అందుకుంది. ఈ కమిటీ అక్టోబరులోనే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉండగా, ప్రభుత్వం గడువును పొడిగించింది. ఈ సూచనలపై అధ్యయనం అనంతరం పరీక్షల విధానంలో మార్పులకు సంబంధించి కమిటీ తన నివేదికలో ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!