

దర్శకుడు సత్యారెడ్డి తెరకెక్కిస్తున్న హాలీవుడ్ చిత్రం ‘కింగ్ బుద్ధ’ భారతీయ భాషల పోస్టర్లను ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు బౌద్ధ భిక్షువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, ఒక భారతీయుడు, ముఖ్యంగా ఒక తెలుగు వ్యక్తి గౌతమ బుద్ధుడి జీవిత చరిత్రను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. చిత్రబృందం, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలిపారు. ఇప్పటివరకు పూర్తయిన సినిమా భాగాలను వీక్షించిన ఆయన, సన్నివేశాలు, పాత్రలు, నిర్మాణానికి సంబంధించి కొన్ని సూచనలు చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు, గౌతమ బుద్ధుడి పాత్రధారి సత్యారెడ్డి మాట్లాడుతూ, మల్లికార్జున ఖర్గే సినిమా పోస్టర్లను ఆవిష్కరించడంతో పాటు విలువైన సూచనలు చేయడం ఆనందంగా ఉందన్నారు. కర్ణాటకతో పాటు ముఖ్యంగా గుల్బర్గా ప్రాంతంలో బౌద్ధ ధర్మ అభివృద్ధికి ఖర్గే కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన సూచనలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అమెరికా, థాయ్‌లాండ్, శ్రీలంక, మలేషియా, వియత్నాం, లావోస్ తదితర దేశాల్లో చిత్రీకరణ జరిపినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది బుద్ధ జయంతి సందర్భంగా 100కు పైగా భాషల్లో, అనేక దేశాల్లో ఈ సినిమాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గౌతమ బుద్ధుడి పాత్ర కోసం 12 కిలోల బరువు తగ్గానని, ఈ పాత్రలో నటించడం తన అదృష్టమని సత్యారెడ్డి తెలిపారు. త్వరలో ఆసియా ఖండంలోని ఓ దేశ ప్రధాని చేతుల మీదుగా, వివిధ దేశాల బౌద్ధ భిక్షువుల సమక్షంలో సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రమేష్, పవన్ రామ్‌తో పాటు పలువురు బౌద్ధ భిక్షువులు పాల్గొని చిత్రబృందాన్ని ఆశీర్వదించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!