

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ విడుదలైన తర్వాత ఆమె జీవితంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమా రూపొందిస్తామని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. అయితే, ఆమె జీవిత కథను వెండితెరపైకి తీసుకురావడానికి గతంలోనే ప్రయత్నాలు జరిగాయన్న విషయం చాలామందికి తెలియదు. 2003లో జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ రచించిన సోనియా: ఏ బయోగ్రఫీ పుస్తకం ఆధారంగా సినిమా తీయాలని అమెరికాలో స్థిరపడిన భారతీయ దర్శకుడు జగన్మోహన్ ముంద్రా, నిర్మాత సునంద మురళి మనోహర్ భావించారు. ఈ చిత్రానికి సోనియా అనే పేరు పెట్టి, సోనియా గాంధీ పాత్రలో హాలీవుడ్ నటి మోనికా బెలూచిని ఎంపిక చేసినట్లు అప్పట్లో ప్రకటించారు. ఆమె కూడా ఈ పాత్రకు అంగీకరించి ఒప్పందంపై సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, సినిమా ప్రారంభానికి కేవలం 60 రోజుల ముందు ఈ ప్రాజెక్ట్‌కు అడ్డంకులు ఎదురయ్యాయి. బయోపిక్‌లో సోనియా గాంధీ జీవితానికి సంబంధించిన వాస్తవాలను వక్రీకరించే అవకాశం ఉందన్న ఆందోళనతో కాంగ్రెస్ పార్టీ చిత్రబృందానికి లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం. దీంతో సినిమా నిర్మాణం నిలిచిపోయింది. ఈ విషయంపై దర్శకుడు జగన్మోహన్ ముంద్రా స్పందిస్తూ, తాను రూపొందించాలనుకున్న కథలో వివాదాస్పద అంశాలేమీ లేవని, సోనియా గాంధీ పట్ల తనకు ఎంతో అభిమానం ఉందని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ సినిమాలో నటించే విషయంపై తర్వాత స్పందించిన మోనికా బెలూచి.. సోనియా గాంధీ పాత్ర కోసం తనను సంప్రదించిన మాట నిజమేనని, అయితే స్క్రిప్ట్ నచ్చకపోవడంతో సినిమాకు అంగీకరించలేదని వెల్లడించారు. దీంతో అప్పట్లో ఆసక్తి రేపిన ఈ బయోపిక్ తెరపైకి రాకుండానే ఆగిపోయింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!