

పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న ఫ్లాట్ నంబర్ 404లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్లతో పాటు ఏసీ కంప్రెసర్లు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించినట్లు సమాచారం. మంటల తీవ్రతకు ఎదురుగా ఉన్న మరో ఫ్లాట్‌కు కూడా అగ్ని అంటుకుంది. దీంతో రెండు ఫ్లాట్లలోని ఫర్నిచర్, గృహోపకరణాలు సహా ఇతర సామగ్రి పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో రెండు ఫ్లాట్లలోనూ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు మరింతగా వ్యాపించకుండా సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారి రాఘవరెడ్డి వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల పూర్తి కారణాలు, జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!