

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో పర్యావరణహిత సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. లడ్డూ ప్రసాదాలను తీసుకెళ్లేందుకు ఇప్పటికే బయోడీగ్రేడబుల్ ఎకో ఫ్రెండ్లీ కవర్లను అందిస్తున్న టీటీడీ.. తాజాగా జనపనారతో తయారు చేసిన జూట్ బ్యాగులను ప్రవేశపెట్టింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు జనపనార రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ పరిమాణాల్లో అందుబాటులో ఉన్న బ్యాగులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విక్రయిస్తోంది.
బ్యాగు పరిమాణాన్ని బట్టి రూ.10, రూ.20, రూ.50, రూ.80, రూ.100 ధరల్లో జూట్ బ్యాగులు లభిస్తున్నాయి. శ్రీవారి ఆలయం వెనుక ఉన్న లడ్డూ విక్రయ కేంద్రం సమీపంలోని జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కౌంటర్లో భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చు. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు టీటీడీ ఇప్పటికే బయోడీగ్రేడబుల్ కవర్లతో పాటు తులసి విత్తనాలతో రూపొందించిన కవర్లను కూడా అందిస్తోంది. ఇప్పుడు పునర్వినియోగానికి అనువైన జూట్ బ్యాగులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యం ఇస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!