

దేశ ఐకమత్యమే భారత్‌ను ముందుకు నడిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి, సురక్షితమైన దేశంగా తీర్చిదిద్దిన ఘనత సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు దక్కుతుందని కొనియాడారు. ఆయన ఆశయాలు, చూపిన మార్గంలోనే దేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో నిర్వహించిన ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్షాలు విభజన రాజకీయాలకు పాల్పడటం దురదృష్టకరమని విమర్శించారు. దేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నించే శక్తుల కుట్రలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వాలు ‘గరీబీ హఠావో’ నినాదానికే పరిమితమయ్యాయని మోదీ విమర్శించారు. తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా గత 12 ఏళ్లలో పేదరికం గణనీయంగా తగ్గి మూడు శాతం దిగువకు చేరిందని తెలిపారు. భారత్‌లో పేదరికం భారీగా తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక కూడా వెల్లడించిందని పేర్కొన్నారు. నక్సలైట్ల హింస నుంచి దేశానికి విముక్తి కల్పించామని, అయితే మేధో నక్సల్స్ అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఐక్యంగా ఉంటే అలాంటి శక్తులు ఏమీ చేయలేవని స్పష్టం చేశారు. దేశాభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని, ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ నినాదంతో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!