

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ఇదే సమయంలో రాష్ట్ర పీక్ విద్యుత్ డిమాండ్ 15 వేల మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం దాదాపు 20 వేల మెగావాట్లకు చేరిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నదులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గడంతో జలవిద్యుత్ ఉత్పత్తి సుమారు 4 వేల మెగావాట్లు తగ్గిందని చెప్పారు. అయినప్పటికీ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు సమర్థంగా పనిచేస్తూ విద్యుత్ సరఫరాను కొనసాగిస్తున్నాయని వెల్లడించారు.
నీటి లభ్యత తగ్గడం వల్లే జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గిందని, రాష్ట్రంలోని అన్ని జలవిద్యుత్ ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని భట్టి తెలిపారు. రాత్రివేళ పెరిగే డిమాండ్‌ను థర్మల్ పవర్ ద్వారా అధిగమిస్తున్నామని, గృహ వినియోగదారులకు 24 గంటల విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని ప్రజలకు సూచించారు. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయపు అల్పాహారం అందించే పథకానికి సంబంధించిన సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!