

కెనడాలోని విక్టోరియా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టొరంటో వెళ్లాల్సిన పోర్టర్ ఎయిర్‌లైన్స్ విమానం ఓ చిన్నారి సీట్‌బెల్ట్ పెట్టుకోవడానికి నిరాకరించడంతో రద్దయింది. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో విమానంలోని చిన్నారి సీట్‌బెల్ట్ పెట్టుకోకుండా సీటుపై నిల్చోవడాన్ని సిబ్బంది గుర్తించారు. దీంతో చిన్నారి తల్లి, క్యాబిన్ సిబ్బంది కలిసి కొన్ని నిమిషాల పాటు సీట్‌బెల్ట్ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే చిన్నారి ఏడుస్తూ, మారాం చేయడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. సీట్‌బెల్ట్ లేకుండా విమానం టేకాఫ్ చేయడం సురక్షితం కాదని భావించిన సిబ్బంది విమానాన్ని టెర్మినల్‌కు తిరిగి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
అనంతరం చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులను విమానం నుంచి దించేశారు. నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి, ఫ్లైట్ ప్లాన్‌ను తిరిగి దాఖలు చేసే సమయానికి రాత్రి 12:30 గంటలు దాటింది. అప్పటికే రన్‌వే మూసివేయడంతో విమాన సర్వీసును రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. మరుసటి రోజు అదే విమానంలో వారిని గమ్యస్థానాలకు తరలించారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి పోర్టర్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!