

అమెరికా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా జార్జియాలో డెమొక్రాట్ల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అట్లాంటాలో జరిగిన బహిరంగ సభలో ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన పాలనను కోరుకునేందుకు, ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపే నాయకులను ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు. జార్జియా గవర్నర్ అభ్యర్థి కీషా లాన్స్ బాటమ్స్, డెమొక్రాటిక్ సెనేటర్ జాన్ ఒసాఫ్‌లకు మద్దతుగా ప్రచారం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు, ఇళ్ల అద్దెలు, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించే ప్రణాళికలు ఉన్న అభ్యర్థులను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు.
జార్జియాలో గ్రామీణ ప్రాంతాల ఆరోగ్య సేవలను మెరుగుపరుస్తామని కీషా లాన్స్ బాటమ్స్ హామీ ఇచ్చారు. అత్యవసర వైద్య సేవలు, గర్భిణులకు అవసరమైన చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెడతానని తెలిపారు. మరోవైపు, వృద్ధులకు ఇన్సులిన్ ధరలను తగ్గించడం, మెడికెయిడ్ సేవలను విస్తరించడం, యువతకు ఉద్యోగ శిక్షణ అందించడం తన ప్రాధాన్యాలని జాన్ ఒసాఫ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, జార్జియాలోని పెర్రీలో జరిగిన రిపబ్లికన్ ప్రచార సభలో ట్రంప్.. హైతీ వలసదారులకు తాత్కాలిక రక్షణ కల్పించే ప్రతిపాదనకు ఒసాఫ్ మద్దతు ఇవ్వడాన్ని విమర్శించారు. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌లో అధికార సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వలస విధానాలు, సరిహద్దు భద్రత, వైద్యం, ఆర్థిక అంశాలు ప్రచారంలో కీలకంగా మారాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!