

తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మెడికల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణ చారి ఆధ్వర్యంలో ప్రతినిధులు శుక్రవారం సీఎం ప్రజావాణిలో నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నెలకొన్న విద్యాపరమైన, మౌలిక సదుపాయాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఆదిలాబాద్ రిమ్స్ బాలికల హాస్టల్‌లో నీటి సమస్య, అధ్యాపకులు, విభాగాధిపతుల కొరత, జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభంలో జాప్యం, జనగాం మెడికల్ కాలేజీలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాలను ప్రస్తావించారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపించాలని, మహేశ్వరం మెడికల్ కాలేజీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడంతో పాటు తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, హాస్టళ్లలో అవసరమైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. హాస్టళ్లలో సురక్షితమైన గీజర్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రత్యక్ష తరగతులు, ప్రాక్టికల్స్, క్లినికల్ పోస్టింగ్‌లు సక్రమంగా నిర్వహించి విద్యార్థులకు విద్యాపరమైన నష్టం జరగకుండా చూడాలని కోరారు. దీనిపై నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు డీఎంఈ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి అధికారులకు కూడా సమస్యలను వివరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!