

బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అధికార బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) కార్యకర్తలు, నిషేధిత ప్రతిపక్ష పార్టీ ఆవామీ లీగ్ మద్దతుదారుల మధ్య శనివారం పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నారైల్ జిల్లాలోని కాలియా ఉపజిల్లాలో ఆవామీ లీగ్ నేతలు, కార్యకర్తలకు చెందిన పలు ఇళ్లను ధ్వంసం చేయడంతో పాటు కొన్నింటికి నిప్పంటించారు. ఈ ప్రాంతంలో గత బుధవారం ఇద్దరు బీఎన్‌పీ నేతలు హత్యకు గురైన నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. బేరా ఉపజిల్లాలోనూ ఇరు పార్టీల మద్దతుదారుల మధ్య ఘర్షణలు జరిగినట్లు సమాచారం.
మరోవైపు, బంగ్లాదేశ్ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జమాతే ఇస్లామీ 40 రోజుల పాటు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. గత రెండేళ్లుగా తమ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వందల మంది హత్యకు గురికాగా, వేలాది మంది జైళ్లలో ఉన్నారని ఆవామీ లీగ్ నాయకుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రతిఘటించడం తప్ప మరో మార్గం లేకుండా చేశారని పేర్కొన్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తున్న నేపథ్యంలో ఆవామీ లీగ్ కార్యకర్తలు హింసకు పాల్పడుతున్నారని జమాతే ఇస్లామీ ప్రధాన కార్యదర్శి మియా మొహమ్మద్ పోర్వార్ ఆరోపించారు. ఈ పరిణామాలతో దేశంలో రాజకీయ అనిశ్చితి, భద్రతాపరమైన ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!