

తెలంగాణను 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో భాగంగా ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాలకు సంబంధించి సచివాలయంలో నిర్వహించిన తొలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సులో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో వాహన తయారీ, ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్యాటరీ టెక్నాలజీ, ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు.
కాలుష్య రహిత తెలంగాణ లక్ష్యంతో రెండేళ్ల క్రితమే ప్రత్యేక ఈవీ పాలసీని అమల్లోకి తీసుకొచ్చామని మంత్రి వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై 100 శాతం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు కల్పించినట్లు తెలిపారు. ఈ ప్రోత్సాహకాలతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2,17,690 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయమయ్యాయని, సుమారు రూ.2,343 కోట్ల మేర పన్ను మినహాయింపులు అందించినట్లు వివరించారు. జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్‌తో పాటు ఎంకతల, కొడంగల్ ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులు, మొబిలిటీ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు భూమి, ల్యాబ్‌లు, రవాణా కనెక్టివిటీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే హ్యుందాయ్, మహీంద్రా, అమర రాజా, ఒలెక్ట్రా, బిలిటి ఎలక్ట్రిక్, ప్యూర్ ఈవీ, బాష్, జెడ్‌ఎఫ్, ఎంఆర్ఎఫ్ వంటి సంస్థలు రాష్ట్ర పారిశ్రామిక రంగంలో భాగస్వాములుగా ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ ద్వారా యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ అధికారులు, ఏథర్, బాష్, జెడ్‌ఎఫ్, టాఫే, జియో బీపీ, ఏవీఎల్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు తమ ఆసక్తిని పలువురు పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!