

విద్యుత్తు వినియోగదారులు ప్రతి నెలా తమ బిల్లులను పరిశీలిస్తే వాటిపై కాంట్రాక్టెడ్ లోడ్, రికార్డెడ్ మాగ్జిమమ్ డిమాండ్ (ఆర్‌ఎండీ) అనే వివరాలు కనిపిస్తాయి. విద్యుత్తు కనెక్షన్ తీసుకునే సమయంలో పంపిణీ సంస్థ అనుమతించిన గరిష్ఠ విద్యుత్తు లోడ్‌ను కాంట్రాక్టెడ్ లోడ్ అంటారు. ఇది కిలోవాట్లలో నమోదవుతుంది. చాలా ఏళ్ల క్రితం తీసుకున్న గృహ విద్యుత్తు కనెక్షన్లలో కేవలం 1 కిలోవాట్ లోడ్ మాత్రమే ఉండేది. అయితే ప్రస్తుతం ఇళ్లలో ఏసీలు, గీజర్లు, ఓవెన్లు, వాషింగ్ మెషిన్లు, మోటార్లు వంటి అధిక విద్యుత్తు వినియోగించే పరికరాలు పెరిగాయి. దీంతో వాస్తవ విద్యుత్తు డిమాండ్ అనుమతించిన లోడ్‌ను మించే సందర్భాలు పెరుగుతున్నాయి. బిల్లింగ్ వ్యవధిలో ఇంట్లో నమోదైన గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌నే ఆర్‌ఎండీగా పరిగణిస్తారు. ఒకేసారి పలు అధిక సామర్థ్యం ఉన్న పరికరాలను వినియోగించినప్పుడు ఆర్‌ఎండీ పెరిగే అవకాశం ఉంటుంది. కాంట్రాక్టెడ్ లోడ్‌ను ఆర్‌ఎండీ మించినట్లయితే అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకోవాలని విద్యుత్తు పంపిణీ సంస్థలు నోటీసులు జారీ చేస్తున్నాయి.
అదనపు లోడ్ క్రమబద్ధీకరణలో డెవలప్‌మెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్‌తోపాటు సర్వీస్ లైన్ ఛార్జీలు కూడా ఉండొచ్చు. అంబర్‌పేటకు చెందిన ఓ వినియోగదారుడి కనెక్షన్‌కు 1 కిలోవాట్ అనుమతి ఉండగా, తనిఖీ సమయంలో 3 కిలోవాట్ల లోడ్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అదనంగా వినియోగిస్తున్న 2 కిలోవాట్లకు కిలోవాట్‌కు రూ.1,200 చొప్పున రూ.2,400 డెవలప్‌మెంట్ ఛార్జీలు, కిలోవాట్‌కు రూ.200 చొప్పున రూ.400 సెక్యూరిటీ డిపాజిట్ విధించారు. యునిఫైడ్ లైన్ ఛార్జీల విధానం ప్రకారం మరో రూ.1,200 సర్వీస్ లైన్ ఛార్జీ కలిపి మొత్తం రూ.4,000 చెల్లించాలని నోటీసు ఇచ్చారు. నోటీసు అందిన 30 రోజుల్లోపు రుసుములు చెల్లించి అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అభ్యంతరాలుంటే 15 రోజుల్లో డీఈకి అప్పీల్ చేసుకోవచ్చు. రుసుములు చెల్లించిన అనంతరం తదుపరి నెల బిల్లులో కాంట్రాక్టెడ్ లోడ్ పెరిగిందో లేదో వినియోగదారులు తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. చెల్లించిన రుసుముల రసీదును కూడా భద్రపరచుకోవడం మంచిది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!