

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ కుమార్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ బారీ గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం (సెప్టెంబర్ 24) చర్లపల్లి జైలులో ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన బారీని జైలు అధికారులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే గుండెపోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించి, చికిత్స అందించినప్పటికీ మృతి చెందినట్లు తెలిపారు. బారీకి గతంలోనూ గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని జైలు అధికారులు వెల్లడించారు.
2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ కుమార్ హత్యకు గురయ్యాడు. అమృతను ప్రణయ్ వివాహం చేసుకోవడాన్ని ఆమె తండ్రి మారుతీరావు వ్యతిరేకించిన నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలింది. 2025 మార్చిలో నల్గొండ ప్రత్యేక కోర్టు కాంట్రాక్ట్ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మకు మరణశిక్ష, అబ్దుల్ బారీతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. విచారణ కొనసాగుతున్న సమయంలో మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులోనూ బారీ అరెస్టయ్యాడు. అయితే ఆ కేసులో అతను నిర్దోషిగా విడుదలైనట్లు నివేదికలు పేర్కొన్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!