

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14, 15 తేదీల్లో విజయవాడలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ సోమవారం వివిధ శాఖల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించి, పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, రాష్ట్రపతి సచివాలయం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ప్రతి కార్యక్రమం నిర్ణీత సమయానికి జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ప్రాథమిక పర్యటన షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 14న సాయంత్రం 6.25 గంటలకు రాష్ట్రపతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లి రాత్రి 7.20 నుంచి 7.40 గంటల మధ్య కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం విజయవాడలో బస చేస్తారు. 15వ తేదీ ఉదయం 11.30 గంటలకు పున్నమి ఘాట్‌కు చేరుకుని, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘సరస్ మేళా’లో మధ్యాహ్నం 1 గంట వరకు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులు, ‘లఖ్‌పతి దీదీ’లతో కలిసి విందులో పాల్గొని, మధ్యాహ్నం 2.45 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామల రావు కూడా సమావేశంలో పర్యటన ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!