

తెలంగాణలోని ఐదు జిల్లాల్లో నిర్వహించిన సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే (SNID) – పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో ఆదివారం చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలి రోజే 17,21,545 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మొత్తం 18,01,698 మంది చిన్నారులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 95.6 శాతం లక్ష్యాన్ని సాధించారు. ఇందుకోసం ఐదు జిల్లాల పరిధిలో 7,428 పోలియో బూత్‌లు, 245 ట్రాన్సిట్ పాయింట్లు, 245 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. బూత్‌ల ద్వారా 16,83,380 మందికి, విమానాశ్రయాలు, బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వంటి ట్రాన్సిట్ పాయింట్ల వద్ద 21,369 మందికి, మొబైల్ బృందాల ద్వారా 16,796 మంది చిన్నారులకు రెండు చుక్కల బైవాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ (bOPV) అందించారు.
ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు 29,712 మంది వ్యాక్సినేటర్లు, 744 మంది పర్యవేక్షకులను నియమించారు. ఐదు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆదివారం పోలియో బూత్‌లకు రాలేకపోయిన చిన్నారులకు టీకాలు అందించేందుకు నవంబర్ 23, 24, 25 తేదీల్లో ఇంటింటి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు కొనసాగించనున్నారు. నిర్దేశించిన లక్ష్యంలోని ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించే వరకు క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!