

నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు. ఇప్పటికే కొండాపురం, కొత్తపట్నం, కావలి, మారెళ్ల, త్రిపురాంతకం, నెల్లూరు, ములుకుదురు తదితర ప్రాంతాల్లో వర్షపాతం నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!