

మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్ల పాటు పనిచేసిన లారా విలియమ్స్ తాజా ఉద్యోగ కోతల్లో భాగంగా ఉద్యోగం కోల్పోయారు. అమెరికాలోని సియాటెల్ కార్యాలయంలో పనిచేసిన ఆమె.. ప్రిన్సిపల్ నాలెడ్జ్ ఇంజినీరింగ్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. బృందాలను నిర్మించడం, కొత్త ఉద్యోగులకు మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 22న ఉద్యోగ కోతల సమాచారం అందుకున్న సమయంలో ఆమె ఇంజినీరింగ్ బృందాలకు ఏఐ టూల్స్ ఉపయోగించి సొంతంగా డాక్యుమెంటేషన్ రూపొందించుకోవడంపై 90 నిమిషాల శిక్షణ ఇస్తున్నారు. అదే సమయంలో 'హై ప్రియారిటీ బిజినెస్ అప్‌డేట్' పేరుతో మైక్రోసాఫ్ట్ టీమ్స్ మీటింగ్ ఆహ్వానం రావడం, ఆ తర్వాత లేఆఫ్ సమాచారం అందడం ఆమెను షాక్‌కు గురిచేసింది. నవంబర్ 22 ఆమెకు చివరి పని దినంగా నిలిచింది.
తన 24 ఏళ్ల కెరీర్‌కు ఇలా ముగింపు రావడం బాధాకరమని లారా లింక్డ్‌ఇన్ పోస్టులో పేర్కొన్నారు. తనతో కలిసి పనిచేసిన డాక్యుమెంటేషన్ బృందాన్ని వృత్తి జీవితంలో గొప్ప విజయాల్లో ఒకటిగా అభివర్ణించారు. తనకు అవకాశాలు కల్పించిన మేనేజర్లు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. 30 ఏళ్లకు పైగా సాగిన తమ జీవిత ప్రయాణంలో భర్త అందించిన సహకారాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. ఆమె పోస్టుపై స్పందించిన పలువురు నెటిజన్లు.. 24 ఏళ్ల అనుభవం, నైపుణ్యాలకు టెక్ రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయని ధైర్యం చెప్పారు. మరోవైపు, మైక్రోసాఫ్ట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలు విభాగాల్లో ఉద్యోగ కోతలు చేపడుతోంది. ఏఐ సాంకేతికతపై ఇతరులకు శిక్షణ ఇస్తున్న ఉద్యోగే లేఆఫ్‌కు గురికావడం టెక్ రంగంలో మారుతున్న పరిస్థితులపై చర్చకు దారితీసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!