

భారత్‌లో పరోక్ష ధూమపానం తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. 1990తో పోలిస్తే 2023లో ఇతరులు వదిలిన పొగను పీల్చడం వల్ల సంభవించిన మరణాలు దాదాపు 50 శాతం పెరిగినట్లు ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. 2023లో దేశంలో సుమారు 3.25 లక్షల మంది పరోక్ష ధూమపానం కారణంగా మరణించినట్లు అంచనా వేయగా, 1990లో ఈ సంఖ్య సుమారు 2.17 లక్షలుగా ఉంది. అంటే తాము ధూమపానం చేయకపోయినా, ఇతరులు వదిలే పొగను పీల్చేవారికి కూడా తీవ్రమైన ఆరోగ్య ముప్పు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
2023లో చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రజలు పరోక్ష ధూమపానానికి గురైన దేశంగా భారత్ నిలిచినట్లు అధ్యయనం తెలిపింది. దేశంలో సుమారు 44.4 కోట్ల మంది ఇతరులు తాగే సిగరెట్లు, బీడీలు, సిగార్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల నుంచి వెలువడే పొగకు గురైనట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా 2023లో సుమారు 271 కోట్ల మంది పరోక్ష ధూమపానానికి గురికాగా, వారిలో దాదాపు 76.7 కోట్ల మంది చిన్నారులు ఉన్నారు. ఇళ్లలోనే కాకుండా కార్యాలయాలు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాలు, ఇతరులు ధూమపానం చేసే ప్రాంతాల్లోనూ ఈ పొగకు గురయ్యే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!