

జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఎస్కోనిగుట్ట కాలనీకి చెందిన చిత్తరి హరిబాబు (28) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ హత్యకు గురయ్యాడు. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబు నెలరోజుల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చాడు. కొంతకాలం తన అన్నతో కలిసి వినాయక విగ్రహాల తయారీ పరిశ్రమలో పనిచేశాడు. అనంతరం కోరుట్లలోని తన ఇంటిని ఖాళీ చేసి నిజామాబాద్‌లో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లాడు. రాజరాజేంద్ర చౌరస్తాలో తల్లితో కలిసి మక్క కంకులు, కూరగాయలు విక్రయిస్తూ జీవిస్తున్నాడు.
గురువారం మక్క కంకులు విక్రయిస్తుండగా కారులో వచ్చిన ఓ వ్యక్తి కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో హరిబాబు మెడ, తలపై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హత్య దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వైష్ణవి హత్యకు గురైన ఆరు నెలలకే హరిబాబు హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. ఏసీపీ ప్రకాశ్ యాదవ్, రెండో టౌన్ ఎస్సై యాదగిరి గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా, హరిబాబును హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కోరుట్ల పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!