

రోడ్లు, వంతెనల నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా నిర్మాణ వ్యయాలను తగ్గించడంతోపాటు నాణ్యత, మన్నికను పెంచుకోవచ్చని మౌలిక సదుపాయాల రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) సమావేశాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన రెండో సాంకేతిక సమావేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో జియోసెల్స్ తయారీ, వంతెనల పునరుద్ధరణ, స్టెయిన్‌లెస్ స్టీల్ వినియోగం, ఏఐ ఆధారిత కాంట్రాక్టుల నిర్వహణ వంటి అంశాలపై ఇంజినీర్లు, అధికారులకు అవగాహన కల్పించారు.
సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ అభివృద్ధి చేసిన సాంకేతికతతో వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేయకుండానే జియోసెల్స్‌గా తయారు చేయవచ్చని డాక్టర్ మోనికా వివరించారు. 500 మీటర్ల రహదారి సబ్‌గ్రేడ్ నిర్మాణానికి సుమారు 50 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించవచ్చని, దీనివల్ల నేలపై పడే ఒత్తిడి 15 నుంచి 20 శాతం వరకు తగ్గుతుందని తెలిపారు. ప్రతి టన్ను ప్లాస్టిక్‌ను పునర్వినియోగించడం ద్వారా సుమారు మూడు టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. పాత వంతెనల సామర్థ్యాన్ని పెంచేందుకు ఎక్స్‌టర్నల్ పోస్ట్ టెన్షనింగ్ యాంకరేజ్‌లకు శాస్త్రీయ రూపకల్పన అవసరమని సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐకి చెందిన డాక్టర్ బిషి వివరించారు. స్టెయిన్‌లెస్ స్టీల్ వినియోగంతో తుప్పు సమస్యను తగ్గించి, దీర్ఘకాలిక నిర్వహణ ఖర్చులను ఆదా చేయవచ్చని జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రతినిధి ఎస్. నైటాని తెలిపారు. మరోవైపు, రోడ్ల నిర్మాణ పనుల్లో ఏఐ ఆధారిత సాంకేతికతతో కాంట్రాక్టుల పర్యవేక్షణ మెరుగుపరచవచ్చని, పనుల్లో జాప్యం, అదనపు వ్యయాలు, వివాదాలను తగ్గించవచ్చని ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌బీసీసీ అధికారులు వివరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!